స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పరీక్షల్లో గ్రూప్ -1 విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్టమైన రీతిలో సేవలు అందించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇదిలా ఉండగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది గ్రూప్–1 సాధించి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రజాభవన్‌లో మెమంటోలు అందజేశారు. సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుంచి వచ్చి ఈ ఘన విజయం సాధించిన మీరు, భవిష్యత్తులో ప్రజాసేవలో ముందుండి వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలని కోరారు.
పోటీతో కూడిన ఈ కాలంలో గ్రూప్–1 విజయం మీ కష్టానికి, ప్రతిభకు నిదర్శనం అన్నారు మల్లు భట్టి వక్రమార్క. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మౌలిక వసతులను మెరుగు పర్చడం జరిగిందని చెప్పారు. మరింత అభివృద్ధి కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటూ, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ సమీపంలో నిరంతర విద్యా సదుపాయాలు కల్పించనున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం. మీరు ఉన్నత హోదాల్లో ప్రజల క్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసి, తల్లిదండ్రులకు గర్వ కారణంగా, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు మల్లు భట్టి విక్రమార్క.






