సంపూర్ణంగా నిషేధం ప్రకటించిన సుబ్బారాయుడు
తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు, జూదంపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయ్యారు ఆయా జిల్లాల ఎస్పీలు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు ఎస్పీ సుబ్బా రాయుడు. తిరుపతిలో ఎస్పీ సుబ్బా రాయుడు మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై స్థాయి అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, మూగజీవాల సంక్షేమ బోర్డు సభ్యులు, ఎన్‌జీవో సంస్థల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కోడి పందేల నిర్వహణకు ప్రయత్నిస్తున్న నిర్వాహకులను గుర్తించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించామని అన్నారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, కోడి పందేల నిర్వహణ కోసం స్థలం లేదా పొలాలు అందించిన వారు, పందేల కోసం కోళ్లకు కత్తులు కట్టిన వారు, వాటిని తయారు చేసిన వారు లేదా సరఫరా చేసిన వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
జూదం, మట్కా వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల వలన సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో పడి కొందరు ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని, ఇది కుటుంబాలకు మరియు సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి అక్రమ క్రీడలను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల సహాయంతో గతంలో కోడి పందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలు, నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక క్రీడలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్: 80999 99977 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.






