పాల్గొన్న వంగలపూడి అనిత, కందుల దుర్గేష్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. డా. బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం కెనాల్ వద్ద తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిర్వహించిన డ్రాగన్ బోట్ ఫైనల్స్ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా పర్యాటక శాఖ, శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా అట్టహాసంగా సాగింది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కోనసీమ ప్రాంతాన్ని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఇలాంటి సాంస్కృతిక ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించే విధంగా ముందుకు సాగుతామని ప్రకటించారు మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. వచ్చే 2047 నాటికి పర్యాటక రంగానికి ప్రత్యేకంగా పాలసీని తీసుకు రానున్నట్లు తెలిపారు.






