కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : ప్రజల విజ్ఞప్తుల మేరకు పనులు చేసి పెట్టిన వారిని సన్మానించు కోవడం పరిపాటి. అధికారులను కలిసి కృతజ్ఞతగా మిఠాయి తినిపించి సాలువతో సన్మానిస్తారు. అదే ఉద్దేశంతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని డాలర్ మెడోస్ కాలనీ ప్రతినిధులు హైడ్రా కార్యాలయానికి వచ్చారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. లే ఔట్ ప్రకారం ఉండాల్సిన రహదారి కోసం పోరాడి.. సాధించుకున్న మిమ్ములనే సన్మానించాలని చెబుతూ..హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వారిని సాలువాలతో సత్కరించారు. మీ లాంటి వాళ్లు మరెంతో మందికి స్ఫూర్తి అంటూ అభినందించారు. 20 ఎకరాలలో మొత్తం లే ఔట్ వేయగా 250 కుంటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి.
ఇక్కడ 5 ఎకరాల వరకూ డెవలప్‌మెంట్ కు తీసుకున్న వ్యక్తి చుట్టూ ప్రహరీ నిర్మించి రహదారిని మూసేయడంతో అక్కడి నివాసితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారిపై ఉన్న ఆటంకాలను తొలగించింది. దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు సిమెంట్ రోడ్డు కూడా వేశారు. ఇందుకు కృతజ్ఞతగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని సన్మానించాలని డాలర్ మెడోస్ నివాసితులు భావించారు. ఇలా వచ్చిన వారినే సన్మానించి.. అక్కడ సమస్యను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించిన హైడ్రా ఇన్‌స్పెక్టర్ నరేష్‌ను కూడా అభినందించారు. డాలర్ మెడోస్ కాలనీ నివాసితులు మరికొంత మందికి ఆదర్శం కావాలని హైడ్రా కమిషనర్ కోరారు.






