రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం
హైదరాబాద్ : ఎన్టీవీ ఛానల్ లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రసారమైన కథనానికి సంబంధించి తెలంగాణ కు చెందిన జర్నలిస్టులు దొంతు రమేష్, పూర్ణాచారిలను సిట్ అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్ గౌడ్. హైదరాబాద్ లో ఆయన టీజేఎఫ్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధిస్తోందని అన్నారు. మంత్రిపై ప్రచారంలో ఉన్న కథనంపై నిష్పక్షపాత విచారణ జరపాలని, సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా ఏ వార్త కూడా ప్రసారం కాదని అన్నారు.
కానీ పెద్దలను వదిలేసి, సామాన్య ఉద్యోగులను బలి పశువులను చేయడం దారుణం అన్నారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక కుట్ర ఉందని అర్థమవుతోందని అన్నారు. సంస్థలో పనిచేసే రిపోర్టర్లకు వివిధ మార్గాల ద్వారా సమాచారం చేరుతుందని అన్నారు. ఆ సమాచారాన్ని కాపీ చేసి ప్రసారం చేయడానికి సంస్థ అనుమతి తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. అసలు మంత్రికి సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రసారం చేయడానికి తెర వెనుక ఎవరు నడిపించారు..? అనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు పల్లె రవి కుమార్ గౌడ్. అరెస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టులు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.






