మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వనపర్తి జిల్లా : కాంగ్రెస్ సర్కార్ సంక్షేమం, అభివృద్దికి పాటు పడుతోందని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసిందన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో పలు విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వనపర్తి పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అనుబంధంగా బాలురు, బాలికల వసతి గృహాలు, కిచెన్–డైనింగ్ హాల్‌ను ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా JNTUH వనపర్తి యూనివర్సిటీ , ప్రభుత్వ కళాశాల విద్యార్థుల కోసం వసతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో వనపర్తి పట్టణంలో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఇదే సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి వంటి మౌలిక వసతుల పనులకు కూడా శంకుస్థాపనలు నిర్వహించడం తనకు మరింత సంతోషాన్ని కలిగించేలా చేసిందన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇదిలా ఉండగా పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. విద్య, వైద్యం, రవాణా, మౌలిక వసతుల రంగాల్లో అన్ని పట్టణాలు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతిపక్షాలు చేస్తన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి , ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు.





