దావోస్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొన్ని రోజులుగా దావోస్ లో వివిధ కంపెనీల దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన సంస్కరణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే క్రమంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రోజు రోజుకు టెక్నాలజీ మారుతోందని, దీనికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అంతేకాకుండా తాము డిజిటల్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ప్రజలకు కావాల్సిన అన్ని సేవలను ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజ్ వట్టికూటితో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ సీఎం కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని ఇతర విశ్వ విద్యాలయాల భాగస్వామ్యంతో యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. విశాఖ మధుర వాడలోని ఐటీ సెజ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.





