దావోస్ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ (TASK), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) యువతకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సిస్కో గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గై డీడ్రిచ్ ప్రశంసించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సమావేశాల సందర్భంగా దావోస్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణలో సిస్కో చేపట్టబోయే పనులపై చర్చించారు.
సిస్కో సీనియర్ అధికారి గై డీడ్రిచ్ మాట్లాడుతూ 2025 మార్చిలో టాస్క్, స్కిల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందాల తర్వాత ఆశించిన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో ధైర్యంగా ప్రారంభించిన గొప్ప ఆలోచన టాస్క్ అని ఆయన కొనియాడారు.ఈ అవగాహన ఒప్పందాల ద్వారా యువతకు కంప్యూటర్ నెట్వర్క్ లు, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణతో విద్యార్థులు చదువు పూర్తికాగానే ఉద్యోగాలు సంపాదించుకునే స్థాయికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను భవిష్యత్తులో ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు ఎక్కువగా వచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.





