ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన
హైదరాబాద్ : ఖాజాగూడ చెరువు కబ్జాల లెక్కలు తేల్చే పనిలో హైడ్రా నిమగ్నమైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయడం.. డైవర్ట్ చేయడంపై మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయడం డైవర్ట్ చేసినట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖలు మార్చినట్టు గుర్తించారు.
చెరువు ఆనవాళ్లు లేకుండా చేయడాన్ని గమనించారు. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంతమంది ఆక్రమించుకుని షెడ్డులు నిర్మించినట్టు గుర్తించారు. తమది భూమి అంటున్నవారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ సందర్బంగా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఎవరైనా , ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇకనుంచి ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





