నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగన్ అని, ఆయన సీమ ద్రోహి అని మంత్రి సవిత మండిపడ్డారు. 2020లో ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వమే అడ్డుకుందని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు స్పష్టం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలను జగన్ గాని, వైసీపీ నాయకులుగాని ఎందుకు ఖండించలేదని మంత్రి సవిత ప్రశ్నించారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. కృష్ణా జలాలను కుప్పం వరకూ తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు దేనన్నారు. రాయలసీమలోని అన్ని చెరువులను నీటితో నింపి, సీమను సస్య శ్యామలం చేస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీ కల్చర్ హబ్, పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.
రాయలసీమను రత్నాల సీమగా మార్చిన ఘనత టీడీపీదేనని, అన్న ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు ఆ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మచ్చుమర్రి ప్రాజెక్టును ఎవరు ఆపారో, పట్టిసీమను ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. జగన్ అయిదేళ్ల పాలనపైనా, కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనపైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత సవాల్ విసిరారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే, పులివెందుల పైనా, అభివృద్ధి పైనా, సంక్షేమం పైనా, వారు చేస్తున్న అన్ని ఆరోపణలపైనా చర్చకు రెడీ అన్నారు. నిబంధనల ప్రకారం జగన్ కు మైక్ ఇస్తామని, ఆయన ఏ అంశంపైనైనా మాట్లాడొచ్చునని తెలిపారు. రప్పా..రప్పా… అంటూ అధికారులను, పోలీసులను, ప్రజలను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ వారిని ఎవరూ పట్టించు కోవడం లేదన్నారు.





