స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నగరంలో పలు చెరువులను పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించామన్నారు. తాజాగా సరూర్ నగర్ చెరువును కూడా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా చెరువు పరిసరాల్లో పెద్దమొత్తంలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటడం, ఇప్పటికే ఉన్న ఇందిరా ప్రియదర్శని పార్కుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ చెప్పారు.
చెరువు చుట్టూ బండ్ తో పాటు వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా పార్కులు, అన్ని వయసుల వారూ వ్యాయామం చేసేందుకు అనువైన ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. చెరువులోకి మంచి నీరు చేరడం వల్ల దుర్గంధ పరిస్థితులు పోయి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం సమకూరుతుందన్నారు. హైడ్రా కమిషనర్ సరూర్‌నగర్ చెరువును సందర్శించడం పట్ల లింగోజిగూడ, గడ్డి అన్నారం కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా చేపడితే చెరువు సర్వాంగ సుందరంగా మారుతుందని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ను శాలువలతో సత్కరించారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ఏసీపీ తిరుమల్ తదితర అధికారులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు.





