కీలక సూచనలు చేసిన బృందం సభ్యులు
అమరావతి : ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం . ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయన 2014లో సీఎంగా కొలువు తీరిన సమయంలో దీనిపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడం, ప్రభుత్వం కోల్పోవడంతో వైసీపీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనిని పట్టించు కోలేదు. తీవ్ర నిర్లక్ష్యం వహించారు. తిరిగి ఏపీలో కూటమి సర్కార్ వచ్చింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆరు నూరైనా సరే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని కంకణం కట్టుకున్నారు సీఎం.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా విదేశీ నిపుణుల బృందం ఏపీలో పర్యటించింది. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. కీలక సూచనలు చేసింది. చివరి రోజు క్షేత్రస్థాయి పరిశీలనలో గ్యాప్ 1 లో తాము రెండో రోజు సూచించిన విధంగా గట్టి పరిచిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువా ఆ మట్టిని తొలగించారు. మట్టి ఎలా గట్టి పడుతోంది, గట్టి పడిన తరువాత దాని స్థిరత్వం ఎలా ఉంది అనేది పరిశీలించారు. ఈ పరీక్ష అనంతరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న వివిధ పనులను చూశారు. ఆ తరువాత మూడో రోజు తాము క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలతో పాటు అన్ని పనులపై సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టులో మూడు రోజులపాటు పర్యటించిన విదేశీ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర రావు ను ఈ ఎన్ సి నరసింహమూర్తి జ్ఞాపికతో పాటు శాలువాతో సత్కరించారు.





