నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట పడినా, కేంద్ర మంత్రిగా మీరు చర్యలు తీసుకోక పోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించడం చరిత్ర ఎప్పటికీ క్షమించదని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో మైనస్ 20 శాతం వరకు తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానాల పేరుతో దాదాపు 10 శాతం ప్లస్ ధరలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న ఈ దుర్మార్గం కేంద్ర మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
లాభాల బాటలో నడిచిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే కుంభకోణాల కేంద్రంగా మార్చిన ఈ అరాచక పాలనను సింగరేణి కార్మికులు ఎప్పటికీ మరిచిపోరని స్పష్టం చేశారు. క్రమంగా సింగరేణిని నష్టాల ఊబిలోకి నెట్టేలా చేసి, చివరికి ప్రైవేటీకరణకు దారి తీసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కూడా తెలంగాణ కార్మిక లోకం గమనిస్తోందని కేటీఆర్ అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
ఈ భారీ స్కామ్‌పై విచారణ జరపాలని క్షేత్రస్థాయిలో సింగరేణి కార్మికులు మోగించిన “జంగ్ సైరన్” కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సాధారణ ఆందోళన కాదని, కార్మికుల ఆగ్రహానికి నిదర్శనమని తెలిపారు.





