శాసన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యత గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. గురువారం శాసన సభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టా కింద 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉందని చెప్పారు. ఈస్ట్రన్ , సెంట్రల్ డెల్టాలో 4.83లక్షల ఎకరాలు, వెస్ట్రన్ డెల్టాలో 5.29 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయని తెలిపారు. గోదావరి డెల్టా సిస్టం పరిధిలో ముంపు సమస్యను నివారించేందుకు సమగ్ర డిపిఆర్ తయారీ కోసం 13.4 కోట్లు కేటాయించి లైడార్ సర్వే చేస్తున్నామని ప్రకటించారు నిమ్మల రామానాయుడు.
లైడార్ సర్వే ఆధారంగా గోదావరి డెల్టా ఆధునీకరణకు సమగ్ర డిపిఆర్ తయారు చేస్తాం అని అన్నారు.
డిపిఆర్ తయారయ్యాక కాలువలు, డ్రైన్లో పూడిక, సైడ్ స్లోప్స్, లైనింగ్, బెడ్ లెవల్స్, గేట్లు, స్లూయిస్లు, క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్లు మరమ్మత్తులు చేపడతాం అని చెప్పారు మంత్రి. 2014-19లో టిడిపి ప్రభుత్వ హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టాం అన్నారు. గత వైసిపి ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా అర్దాంతరంగా పనులు నిలిపి వేసిందన్నారు. వైసిపి పాలనలో ఓఅండ్‌ఎం పనులు సైతం చేయకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరందని పరిస్దితి నెలకొందన్నారు. గోదావరి డెల్టాలో ముంపును నివారించి, చివరి ఎకరం వరకు సాగు నీరందించడమే చంద్రబాబు లక్ష్యం అని స్పష్టం చేశారు.





