స్పష్టం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా : జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారడం పక్కా అని అన్నారు. తను పార్టీ మారుతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న పార్టీ పెద్దలు ఒక్కరొక్కరుగా తనను కలుస్తూ వచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సభ్యుడు వంశీ చందర్ రెడ్డి జీవన్ రెడ్డిని కలిశారు. ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
అయినా ఎలాంటి స్పందన రాలేదు జీవన్ రెడ్డి నుంచి. తాను అనేక రకాలుగా అవమానాలకు గురైనట్లు వాపోయారు. తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ చేసిన బుజ్జగింపులు విఫలమయ్యాయి. తాను ఏ డిమాండ్లను పీసీసీ ముందు పెట్టలేదని, తన సమస్యకు అధిష్ఠానం వద్ద పరిష్కారం లేదని అన్నారు. పార్టీ మారొద్దని పీసీసీ చీఫ్ కోరారు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులు కోవడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు జీవన్ రెడ్డి .





