చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని ఆక్రమణకు గురైన చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా శంషాబాద్ మండలం మామిడిపల్లి పరిసరాల్లో నాలుగైదు చెరువులు మాయమయ్యాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తు దీనిపై తీవ్రంగా స్పందించారు కమిషనర్. ఒంగోని కుంట, కనకయ్యకుంట, మర్రివాణికుంట, ఎర్రకుంటలో కొన్నిటిని పూర్తిగా ఆక్రమించడాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు.
ఇక్కడి చెరువులు, వరద కాలువల గురించి పూర్తి సమాచారం సేకరించాలని సూచించారు ఏవీ రంగనాథ్. ఈ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువలను కబ్జా చేయడం లేదంటే ఇష్టానుసారం మూసేయడంతో వర్షాకాలం వరద ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో నివాసాలు నీట మునుగు తున్నాయనే ఫిర్యాదులను కూడా పరిశీలించారు. ఆక్రమణదారులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి కబ్జాలను తొలగించాలని సూచిస్తామని అన్నారు. లేని పక్షంలో హైడ్రా నేరుగా రంగంలోకి దిగుతుందని స్థానికులకు స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు.





