హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై, పాలన గాడి తప్పడంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ అసమర్థ పాలనపై సమర శంఖం పూరిస్తున్నామని ప్రకటించారు. రేవంత్ కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత హామీలు, వైఫల్యాలపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పోరుబాటకు సిద్దం అవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు . ఆరోజు తెలంగాణ భవన్‌లో చార్జ్‌షీట్ లోగో ఆవిష్కరణ , 7 రోజుల కార్యాచరణపై ప్రారంభ ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. 2వ తేదీన 6 గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బాకీ కార్డుల పంపిణీ , 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీల ప్రదర్శన కొనసాగుతుందన్నారు. 3వ తేదీన వ్యవసాయం, సాగునీరు, కరెంట్, యూరియా, రైతు బీమా సమస్యలపై రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. 22A నిషేధిత భూముల సమస్యలపై హైదరాబాద్ , అర్బన్ ఏరియాల్లో ధర్నాలు చేపడతామన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్.
ఇక 4వ తేదీన మహిళలకు ₹2500, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, స్కూటీల సాధనకై వృద్ధులు, దివ్యాంగులు, మహిళలతో వంట-వార్పు ఉంటుందన్నారు. 5వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలు కోసం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థి, యువజన ర్యాలీలు నిర్వహిస్తారన్నారు . 6వ తేదీన సింగరేణి 12 నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ (CCI)లలో నిరసన సదస్సులు ఉంటాయని తెలిపారు. తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాల సమస్యలపై హైదరాబాద్‌లో ఆటో ర్యాలీ నిర్వహిస్తామన్నారు .పల్లెల విధ్వంసం, పారిశుద్ధ్య వైఫల్యాలపై గ్రామాల్లో నిరసనలు చేపడతారని తెలిపారు. 7వ తేదీన 420 హామీల అమలుపై జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో వినతి పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. 8వ తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తారని, 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పోరాటానికి సంఘీభావం తెలియ చేస్తామన్నారు డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్.





