టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన శ్రీశైలం దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కర్నూల్ కు వెళతారు. నిర్వహించే సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే 3,500 బస్సులు ఏర్పాటు చేశామన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. మంచి నీళ్లు, మజ్జిగ, పులిహోర ప్యాకెట్లు సిద్దం చేశామన్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ ల సహకారంతో ఏపీలోని విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వచ్చిందని చెప్పారు.
ఇది రావడంలో కీలక పాత్ర లోకేష్ పోషించాడన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించి రాష్ట్రానికి వచ్చేలా చేశారని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు. అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకు వచ్చిందన్నారు. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పారు సీఎం. విభజనతో ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్ట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా పరంగా అనేక తప్పులు చేశారని, వాటిని సరి చేయడానికే చాలా సమయం పట్టిందన్నారు. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశామన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుందన్నారు.






