జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్
హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు . శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇందు కోసం మోదీ సర్కార్ చట్టం తీసుకు రావాలని కోరారు. లేక పోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు న్యాయ పరమైన రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందని, వాటిని అమలు చేయనంత వరకు ఆయా రాజకీయ పార్టీలను, నేతలను అడ్డుకుని తీరుతామన్నారు. లేకపోతే వారికి పుట్టగతులు ఉండవన్నారు. ఇప్పటి వరకు ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తి వేయాలని కోరారు. మహిళా బిల్లు లో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని కోరుతూ
నవంబర్ 25వ తేదీ నుండి జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్బంగా వేలాది మందితో నిలదీస్తామని ప్రకటించారు.
అంతే కాకుండా బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత దేశంలో ప్రధాన రాజకీయ కూటములైన ఎన్డీఏ, ఇండియా కూటములే బాధ్యత తీసుకోవాలని, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లను ఢిల్లీలో కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి తీసుకువస్తామని వారు స్పష్టం చేశారు. ప్రధానంగా బీసీ డిమాండ్లపై తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, గోవా, చతిస్గడ్, హర్యానా, యూపీ, బీహార్, తమిళనాడు, తదితర రాష్ట్రలలో అనేక సభలు సమావేశాలు నిర్వహించామని అన్నారు. అవసరమైతే బీసీ డిమాండ్లపై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టి బీసీల ఆకాంక్షలను ఢిల్లీకి వినిపిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావు చెప్పారు.
బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ , బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర, బీసీ కుల సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ శేఖర్ సగర, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ నాయక్, బీసీ నేతలు గూడూరు భాస్కర్ మేరు, నరసింహ చారి, యామ మురళి, ఆరూరు వెంకటేశ్వర్లు, మధు యాదవ్, వీరభద్ర చారి, శ్రీనివాసచారి, అనిల్ గౌడ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.






