స్పష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్టర్
హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ పోలీసులు కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారని వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలిసుల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అదే సమయంలో స్వచ్చంద సంస్థల సహకారం కూడా ఈ విషయంలో ఆలచించాలని కోరారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సాయం చేసేందుకు పోలీస్ లు సిద్ధంగా ఉంటారని అలాంటి వారికి అండగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
పోలీసుల సంక్షేమానికి ఎం ఈ ఐ ఎల్ చేస్తున్న కృషిని రితిరాజ్ అభినందించారు. తమ బెటాలియన్ లో జిమ్ ఏర్పాటు చేయాల్సిందిగా కమాండెంట్ రామకృష్ణ సుధారెడ్డి ని కోరగా ప్రతిపాదన పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నానక్ రాంగూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ భవనం నలువైపులా కొండాపూర్ లోని టి ఎస్ ఎస్ పీ సిబ్బంది 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఒక్కో షిఫ్ట్ లో 24 మంది విధుల్లో ఉంటారు. ఇప్పటి వరకు వీరు పాత ఇనుప కంటైనర్లలో లో ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునే వారు. అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి ఇబ్బందిని గమనించిన బెటాలియన్స్ అదనపు డి జీ పీ సంజయ్ కుమార్ జైన్ సూచనతో బెటాలియన్స్ కమాండెంట్ రామకృష్ణ , అసిస్టెంట్ కమాండెంట్‌లు ఎం.పార్ధసారధి రెడ్డి, ఎస్.రాంబాబు తదితరులు ఎం ఈ ఐ ఎల్ యాజమాన్యాన్ని కలిసి తమ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.
ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేసే పోలీసులకు సహాయ పడటంలో ఎపుడూ ముందుండే ఎం ఈ ఐ ఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి అందుకు తమ సమ్మతిని తెలిపారు. విశ్రాంతి గృహాన్ని విశాలంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి 50 మంది పోలీసులు విశ్రాంతి తీసుకునేలా నాలుగు ఏ సిలు, 24 ఫ్యాన్ల సౌకర్యంతో బ్యారెక్స్ నిర్మిస్తున్నారు. పోలీసులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఎం ఈ ఐ ఎల్ నిర్మిస్తోంది. అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వర్తించే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ భవనాలు వినియోగించు కోనున్నారు. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ దక్షిణ ఆసియాలోనే పెద్దది. ప్రతి రోజు 3500 వీసా దరఖాస్తులను స్వీకరించే సామర్ధ్యంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించే ఈ కార్యాలయాన్ని పోలీసులు నిరంతరం కాపలా కాస్తుంటారు. వీరి సౌకర్యార్ధం ఎం ఈ ఐ ఎల్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.






