దూకుడు పెంచిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో కబ్జాలకు గురైన స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. మియాపూర్ లో ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు. దీంతో నగరంలో ఆక్రమణదారులు, కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ తరుణంలో తాజా మియాపూర్ లో రూ. 300 కోట్ల విలువ చేసే ప్రభుత్వానికి చెందిన ఎకరం భూమితో పాటు ప్రభుత్వం కేటాయించిన పార్కు స్థలాన్ని గుర్తించింది హైడ్రా. ఈ మేరకు ఆక్రమణలకు చెక్ పెట్టింది. కబ్జాలను తొలగించింది. హైడ్రా బోర్డు స్థలాన్ని ఏర్పాటు చేసింది. పలువురు స్థానికులు ఆక్రమణలకు గురైన విషయాన్ని ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషనర్ ఫోకస్ పెట్టారు.
ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నెక్నాంపూర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 1996లోనే పార్కు, ప్రజావసరాల స్థలాన్ని గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చినట్టు తేలింది. అయితే తర్వాత మున్సిపాలిటీ అయ్యాక 2019లో ఈ స్థలాలకు అనుముతులు ఇచ్చినట్టు స్థానికులు హైడ్రాకు తెలిపారు. ఇలా పలు వివాదాల్లో ఉన్న 1600ల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీని విలువ రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే మున్సిపాలిటీలోని తిరుమల హిల్స్‌లో 6150 గజాల పార్కు స్థలం కూడా కబ్జాలకు గురైంది. ఇందులో తాత్కాలికంగా వేసిన షెడ్డులు, కాంపౌండ్ వాల్‌ను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 120 కోట్లు వరకూ ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు.






