జెండా కప్పి ఆహ్వానించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ : వర్దమాన నటి ఆమని శనివారం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా ఆమని 1990వ దశకంలో ప్రముఖ కథానాయికగా రాణించారు నటి ఆమని. ఆమె దక్షిణాదిన ప్రముఖ నటులతో కలిసి నటించారు. కమల్ హాసన్, నాగార్జున అక్కినేని, బాలకృష్ణ, జగపతి బాబు వంటి అగ్ర నటులతో సినిమాలలో పని చేశారు. ఆమె ‘శుభ లగ్నం’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ‘శుభ సంకల్పంస , ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రాలకు ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకున్నారు.
కాగా ఆమని ఆ తర్వాత కొంత కాలం దూరమయ్యారు. కానీ తిరిగి ‘ఆ నలుగురు’ చిత్రంతో సినిమాల్లోకి తిరిగి ప్రవేశించచారు. ప్రస్తుతం సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తున్నారు ఆమని. ఆమె తెలుగు , తమిళ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు. ఆమనితో పాటు, ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ , నంది అవార్డు గ్రహీత శోభలత కూడా బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ తదితర పలువురు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, తెలుగు సినిమాకు ఆమని చేసిన సేవలు, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో పాటు టెలివిజన్ సీరియల్స్‌లో ఆమె విజయవంతమైన కెరీర్ గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనతో స్ఫూర్తి పొంది, దేశానికి సేవ చేయాలనే ఆకాంక్షతో ఆమని , శోభలత బీజేపీలో చేరారని ఆయన అన్నారు.







