యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖర్చు చేశాం
అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజం కాదన్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి రూ. 94 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. తన లాగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదని మండిపడ్డారు. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేయాలని జగన్ ఇవాళ దొరికిన ప్రతీ దారిని ఎంచుకుంటున్నారని ఆరపించారు. ఈ క్రమంలో పర్యాటక శాఖకు ఏటా రూ. 7.5 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే హరిత రిసార్ట్స్ స్థానంలో ఋషికొండ ప్యాలెస్ ను నిర్మించడం వల్ల రెవిన్యూ కోల్పోందన్నారు. ప్రస్తుతం ప్రతి నెల విద్యుత్ చార్జీలు, నిర్వహణ రూపంలో పర్యాటకశాఖ పై రూ. 25 లక్షల నిర్వహణ భారం పడుతుందని, ఇది మాజీ సీఎం జగన్ నిర్వాకం కాదా అని నిలదీశారు.
ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారత దేశమని, అలాంటి ప్రపంచ యోగా దినోత్సవ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అందులోనూ ఉత్తరాంధ్ర వేదిక కావడం ఎంతో అదృష్టంగా భావించామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3 లక్షల మందిని భాగస్వామ్యం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని గుర్తు చేసారు. ప్రజల ఆరోగ్యం పట్టని జగన్ రెడ్డి ఇవాళ యోగాంధ్ర కార్యక్రమంపై విషం కక్కుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్న గొప్ప కార్యక్రమంపై జగన్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నేరస్థులు, ఖైదీలు, రౌడీలకు అండగా నిలిచే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సహించలేక పోతున్నారన్నారు. నాడు గంజాయి వనాలుగా ఉన్న వాటిని నేడు కాఫీ వనాలుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెడుతున్నామన్నారు. ఇన్ని మాటలు మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు పెట్టారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.





