నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత
మంగళగిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. కావాలని ఏపీ సర్కార్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో సవిత మీడియాతో మాట్లాడారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అందుకే పీపీపీ మోడల్‌లో కాలేజీలను పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నది ఒక గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరుగుతుంటే దాని మీద కూడా రాజకీయం చేయడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. దీనిపై తమకు పూర్తిగా క్లారిటి ఉందన్నారు సవిత.
మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో పూర్తి చేస్తామని ప్రకటించారు, ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం. మీలాగా పరిపాలనను గాలికి వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీపీపీ మోడల్ అంటే ఏమిటో మీకు తెలుసు, ఇతర రాష్ట్రాల్లో అది ఎంత సక్సెస్ అయిందో కూడా మీకు తెలుసు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరించడం.. ప్రపంచ బ్యాంకుకు ఉత్తరాలు రాసి రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేయడం.. పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకోవడం.. ఇదా మీ రాజకీయం? మీరు ఏం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని అన్నారు. ఆఖరికి మీ సొంత తల్లి, చెల్లి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరంటే మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అన్ని శాఖలు అభివృద్ధిలో దూసుకు పోతున్నాయని అన్నారు.





