వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి
తాడేపల్లిగూడెం : జనం మెచ్చిన జన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి. డిసెంబర్ 21న ఆదివారం జగన్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో భారీ కేకును కట్ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడారు. తన పాలనలో నిస్వార్థంగా సేవలందించిన ఫలితమే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలే అజెండాగా పాలన అందించారని చెప్పారు. ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి అందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన్ను ప్రజలు ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఎన్నో అవరోధాలు, ఓటములు పలకరించినా చెక్కుచెదరని చిరునవ్వుతో ప్రజల ఆకాంక్షల సాధనే ఎజెండాగా వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్సార్సీపీ పోరాటాలు చేస్తూ వస్తోందని చెప్పారు.
అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూడ లేదని అన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అధికారం ఇచ్చిన ప్రజల కోసం బాధ్యతగా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించిన నాయకులు దేశంలో వైయస్ తప్ప ఇంకొకరు ఉండరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని అన్నారు. చేసేదే చెప్తాం.. చెప్పినవన్నీ చేస్తా అనేలా ముందుకు సాగారని జగన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. చెప్పినవే కాకుండా ఎన్నో చెప్పని హామీలు కూడా తన పాలనలో అమలు చేసి చూపించారని అన్నారు. పార్టీని క్రమశిక్షణతో నడుపుతూ వస్తున్నారని పేర్కొన్నారు. అందుకే వైయస్సార్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.






