కీలక వ్యాఖ్యలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంగళగిరిలో జరిగిన “పదవి- బాధ్యత” సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు. పార్టీ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయని చెప్పారు. మరికొంత మందిని త్వరలో నామినేట్ చేస్తాం అన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన వారికి, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్. ఎటువంటి సిఫార్సు లేకుండా పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. పదవి అనేది చిన్నదా? పెద్దదా? అని కాకుండా వచ్చిన పదవిని ప్రజలకు సేవ చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి లభించే గొప్ప అవకాశంగా భావించాలని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం తక్కువగా ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం ఎలక్షన్ కోణంలోనే ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఉంటుందన్నారు.. దానికి విభిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ ఉండాలని జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. యువతకు ఈ పార్టీ వేదిక కావాలని అనుకున్నానని అన్నారు. ఈరోజు మనకు 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతమంది కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరి భావజాలం, పోరాటశక్తి, పోరాట పటిమ అని గుర్తించాలన్నారు. ఏ పార్టీకి అయినా సమున్నతమైన భావజాలం, సిద్దాంతం ఉండాలన్నారు.





