దుర్గం చెరువు దుర్గంధంపై రంగనాథ్ సీరియస్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ఆయన చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం పట్ల మండిపడ్డారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ శాఖ, రహేజా మైండ్‌స్పేస్, ఎస్‌టీపీల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేక పోవడం, బాధ్యతగా భావించక పోవడం వల్లనే దుర్గం చెరువు దుర్గంధానికి కారణమని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. చుట్టుపక్కల మురుగు నీరంతా ఎస్‌టీపీ లైన్లోకి వెళ్లేలా జాగ్రత్త పడాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల వద్ద మురుగు నీరు శుభ్రం అయిన తర్వాత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకోసం పీసీబీకి పంపాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
దుర్గం చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం హైడ్రా కార్యాలయంలో చెరువు పరిరక్షణ బాధ్యతలు చేపట్టిన అన్ని సంస్థలతో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. వరద కాలువలోకి మురుగు నీరు వెళ్లకుండా పైపులైను డైవర్షన్ పనులు చేపట్టడానికి జలమండలికి ఉండే ఇబ్బందులను తొలగించాలని అన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా. ఎం రమేష్ తో మాట్లాడి ట్రాఫిక్ డైవర్షన్‌కు సహకరించాలని సూచించారు. అలాగే ఇరిగేషన్, విద్యుత్, జీహెచ్ ఎంసీ, జలమండలి విభాగాధికారులతో కూడా మాట్లాడారు. మురుగునీరు దుర్గం చెరువులోకి చేరకుండా చేపట్టే పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో చెరువు అభివృద్ధి పనులు చేపట్టిన రహేజా సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఇన్ ఆర్బిట్ మాల్, నెక్టర్ గార్డెన్స్ ఇలా పై భాగంలోని ఐటీ సంస్థల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులోకి కలవకుండా చెరువుకు ఆనుకుని పడమర వైపు కాలువను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.





