అక్రమాస్తుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ
వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున దాడులను నిర్వహిస్తోంది. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ పట్టుబడగా ఇవాళ ఏకంగా హనుమకొండ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ పై అక్రమాస్తులు పెద్ద ఎత్తున కూడబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్బంగా ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయనకు సంబంధించిన నివాసాలతో పాటు ఇతర బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. పంచానామా అనంతరం డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డికి చెందిన అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది ఏసీబీ.
ఇదిలా ఉండగా వెంకట్ రెడ్డి గత ఏడాది డిసెంబర్‌లో రూ. 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. . ఈ దాడుల సమయంలో, అధికారులు ఆ అధికారికి చెందినవని ఆరోపించ బడుతున్న నగదు, బంగారం , ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత, అతన్ని సస్పెండ్ చేశారు. అధికారుల ప్రకారం, ఒక పాఠశాలకు అనుమతి ఇవ్వడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.





