పులిలా పోరాడుతా సింహంలా గర్జిస్తా
నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లా – మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను తీవ్రంగా ఎండగట్టారు. ఛలో నల్లగొండ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కేసీఆర్.
శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పులిలా పోరాడుతానని, సింహంలా గర్జిస్తానంటూ ప్రకటించారు . రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయమంటూ స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చినోడిని, నన్ను తిరగనీయం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డీ నీకంత సీన్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. నాతో ఢీకొనే దమ్ము ధైర్యం నీకు ఉందా అంటూ నిలదీశారు. తాము కూడా సభ తర్వాత మేడిగడ్డకు వెళతామన్నారు. ప్రాణహితలో నీరుందని ఆ మేరకు రైతులకు నీరు అందించ వచ్చన్నారు.
ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారని, కానీ తాను కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పు కోలేదన్నారు కేసీఆర్. అసెంబ్లీలో చేసిన తీర్మానం సరికాదని, అందులో తాగునీరు, సాగునీటి ప్రస్తావన ఉంది కానీ విద్యుత్ ప్రస్తావన లేదన్నారు.
టీఎస్ ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి తెలంగాణకు సరైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మూడింట రెండొంతుల బలంతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.