జగన్ కు వేల కోట్లు ఎక్కడివి..?
టీడీపీ నేత నారా లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్రమంగా వేల కోట్లు సంపాదించు కున్నాడని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై. ఒక్కో చోట 500 గదులతో లోటస్ పాండ్ , కడప ఎస్టేట్, పులివెందుల ఎస్టేట్, బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ లు ఎలా కట్టుకున్నారని, ఎవరిని మోసం చేసి వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఉపయోగ పడే రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి దిక్కు మాలిన పాలనకు నిదర్శనమన్నారు. ఎక్కడ చూసినా గతుకుల రోడ్లే దర్శనం ఇస్తున్నాయంటూ ధ్వజమెత్తారు నారా లోకేష్.
పాలకొండ నుంచి కురుపాం శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తుంటే కంకర పరిచి వదిలేసిన ఈ రహదారి కన్పించిందన్నారు. విషయమేమిటని స్థానికులను వాకబు చేయగా, కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వక పోవడంతో సగంలో వదిలేసి వెళ్లాడని తేలిందన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు రూ.1.80 లక్షల కోట్లు బకాయిలు పడ్డారని, అవి చెల్లించక పోవడంతో వారంతా పరారై పోయారంటూ ధ్వజమెత్తారు.