NEWSTELANGANA

డీఎస్సీతో బీఈడీ అభ్య‌ర్థుల‌కు న‌ష్టం

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన బీఎస్పీ చీఫ్

హైద‌రాబాద్ – బీఎస్పీ బాస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తాజా డీఎస్సీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్ర‌క‌ట‌న వ‌ల్ల బీఈడీ అభ్య‌ర్థుల‌కు తీవ్ర నిరాశే మిగిలింద‌ని పేర్కొన్నారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌భుత్వానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

రాష్ట్రంలో దాదాపు 4 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నార‌ని , వారికి కేవ‌లం 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే చూపించ‌డం అన్యాయ‌మ‌ని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత లేనట్లే.

విద్యా శాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా ఉంద‌ని గుర్తించాల‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించిందని ఆరోపించారు.

వాస్తావానికి టెట్ సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని కానీ ఆ ప‌ని చేయ‌లేద‌న్నారు. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేస్తే బాగుండేద‌ని పేర్కొన్నారు బీఎస్పీ చీఫ్‌. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయిందని గుర్తు చేశారు.

పాఠశాలల్లో మానసిక నిపుణుల (కౌన్సిలర్లు) ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలకు పాల్ప‌డ‌కుండా ఉండేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపారు ఆర్ఎస్పీ.