అపూర్వ ఘట్టం ఆవిష్కృతం
వైభవంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
అయోధ్య – అపూర్వమైన ఘట్టం ముగిసింది. అంగరంగ వైభవంగా అయోధ్య లోని రామ మందిరంలో శ్రీరాముడు కొలువు తీరాడు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కుంకుమను దిద్దారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దర్శించుకున్నారు.
దేశానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన నటీ నటులు, క్రీడాకారులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కొలువు తీరారు. 500 ఏళ్ల తర్వాత రామాలయం కొలువు తీరడం విశేషం. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్ని తాకింది.
జనవరి 22న సోమవారం 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకండ్ల పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కొనసాగింది. నవ నిర్మిత రామ మందిరంలో నీల మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరగడం విశేషం.
అయోధ్య నగరమంతా రామ నామంతో మార్మోగింది. దేశమంతటా శ్రీరాముడి శోభతో నిండి పోయింది. యావత్ ప్రపంచం రామ జపంతో దద్దరిల్లింది.
ఈ మహత్కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7వేల మంది విచ్చేశారు.