అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డూలు
రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్దం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. భారీ ఎత్తున నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున రవాణా సదుపాయం కల్పించారు.
ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులందరికీ రామ జన్మ భూమి ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. ఇదిలా ఉండగా లక్షలాది మంది అయోధ్యకు తరలి వెళ్ల నున్నారు. లక్ష మందికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేయాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మేరకు లక్ష లడ్డూలను సిద్దం చేసింది. వాటిని అయోధ్యకు పంపించే పనిలో పడింది. ఈ విషయాన్ని గురువారం టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉండగా 22న రామాలయ మహా సంప్రోక్షణ మహోత్సవానికి హాజరయ్యే అతిథులు, భక్తులందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన శ్రీవారి లడ్డూలను అందజేస్తారు.
ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోభన్ భగవత్ , యూపీ సీఎం యోగి తో పాటు సినీ తారలు, ప్రముఖ క్రికెటర్లు, అగ్రశ్రేణి ఆటగాళ్లు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఆహ్వానితుల జాబితాలో 7 వేల మందికి పైగా ఉన్నారని సమాచారం.
ఈ సందర్బంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరికీ ఇది పవిత్రోత్సవమని పేర్కొన్నారు. హిందూ మతం, సంస్కృతి, విలువలను ప్రచారం చేయడమే టీటీడీ ముఖ్య ఉద్దేశమన్నారు. రామ జన్మ భూమి పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.