ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆటో డ్రైవర్ల సంఘాల నేతలతో మంత్రి భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తాము రోడ్ల పాలయ్యామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తమకు నెలకు సరిపడా డబ్బులు వచ్చేవని, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం కారణంగా తమకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. దీనికి ప్రధాన కారణం మహిళలకు ఉచితంగా బస్సులలో రవాణా సదుపాయం కల్పించడమేనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, యువతులకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే విధంగా అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో ఎవరూ ఆటో డ్రైవర్లకు పని లేకుండా పోయింది. ఎవరూ కూడా ఆటోలను ఎక్కేందుకు ముందుకు రావడం లేదని ఆటో డ్రైవర్లు ఆరోపించారు.