ఆప్ సర్కార్ కూల్చివేతకు కుట్ర
సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని దొడ్డి దారిన కూల్చేందుకు మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
దేశంలో బీజేపీ ఒక్కటే ఉండాలని అనుకుంటోందని, దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. శనివారం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. తాము ప్రతిపక్ష కూటమిలో ఉన్నామనే కోపంతో కావాలని కేసులు బనాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు .
ప్రత్యేకించి ఢిల్లీలో తాము పాగా వేయాలని అనుకుంటున్నారని, కానీ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. మీరు కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుంటే తాము ప్రజలను నమ్ముకున్నామని, తమకు ఏమీ కాదన్నారు.
ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేసిందని, ఆప్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారని వారిని ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు సీఎం కేజ్రీవాల్. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని అంటోందని, ఈ విషయం వారే తనకు చెప్పారని తెలిపారు. కొన్ని రోజులయ్యాక తనను అరెస్ట్ చేస్తామంటూ బెదిరిస్తోందని ధ్వజమెత్తారు. ఆప్ కూలి పోయాక టికెట్లు ఇస్తామంటూ చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.