NEWSTELANGANA

ఆ న‌లుగురు ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు

Share it with your family & friends

నియ‌మించిన రేవంత్ రెడ్డి స‌ర్కార్

హైద‌రాబాద్ – ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాల‌నా ప‌రంగా త‌న‌కు ప‌ట్టు ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి పెద్ద పీట వేసే ప‌నిలో ప‌డ్డారు.

దివంగ‌త వైఎస్సార్ కు కేవీపీ రామ‌చంద్ర‌రావు ఎలాగో రేవంత్ రెడ్డికి వేం న‌రేంద‌ర్ రెడ్డి అలాంటి వాడ‌నే ప్ర‌చారం ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే సీఎం ప్ర‌యారిటీ ఇచ్చారు. ఏకంగా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈ నియామ‌కం పూర్తిగా రాష్ట్ర మంత్రి హోదాలో ఉంటుంద‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ తాజాగా జారీ చేసిన ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు. న‌రేందర్ రెడ్డికి ప్ర‌జా వ్య‌వ‌హారాల విభాగం చూస్తార‌ని తెలిపారు.

ఇక మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు , మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ. ఆయ‌న‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్య‌వ‌హారాల‌పై ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుడిగా నియ‌మించింది. ఇక ముందు నుంచీ అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న మాజీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వికి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా డిల్లీలో ఉండేలా ఛాన్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రోటోకాల్, ప్ర‌జా వ్య‌వ‌హారాల విభాగానికి సంబంధించి స‌ల‌హాదారుడిగా హ‌ర్క‌ర వేణుగోపాల్ రావుకు అవ‌కాశం ఇచ్చింది. మొత్తంగా రేవంత్ రెడ్డి టీంలో వీరంతా కీల‌కం కానున్నారు.