ఈ గెలుపు నాది కాదు శ్రీలంక ప్రజలది – అనుర
శ్రీలంక అధ్యక్షుడు కుమార దిస నాయకే
శ్రీలంక – శ్రీలంక దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసనాయకే కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దిస నాయకే శ్రీలంక దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
శతాబ్దాలుగా మనం పెంచుకుంటున్న కల ఎట్టకేలకు సాకారం అవుతోంది. ఈ ఘనత ఏ ఒక్క వ్యక్తి కృషి ఫలితం కాదు, వందల వేల మంది మీ సమిష్టి కృషికి దక్కిన ఫలితం. మీ నిబద్ధత మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది, అందుకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఈ విజయం మనందరిది అని ప్రకటించారు అనుర కుమార దిస నాయకే.
ఈ లక్ష్యం కోసం తమ చెమట, కన్నీళ్లు, ప్రాణాలను సైతం అర్పించిన ఎందరో త్యాగాల వల్ల ఇక్కడి మా ప్రయాణం సాగింది. వారి త్యాగాలు మరువలేనివి. మేము వారి ఆశలు, పోరాటాల అండదండలతో ఇక్కడి దాకా వచ్చామని అన్నారు దేశ అధ్యక్షుడు, అది మోస్తున్న బాధ్యతను తెలుసు. ఆశ, నిరీక్షణతో నిండిన లక్షలాది కళ్ళు మమ్మల్ని ముందుకు కదిలేలా చేశాయని అన్నారు. శ్రీలంక చరిత్రను తిరిగి రాసేందుకు ప్రయత్నం చేస్తామని, ఆ దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు అనుర కుమార దిసనాయకే.
ఈ కల కొత్త ప్రారంభంతో మాత్రమే సాకారం అవుతుంది. సింహళీయులు, తమిళులు, ముస్లింలతో పాటు శ్రీలంక ప్రజలందరి ఐక్యత ఈ కొత్త ప్రారంభానికి పునాది. ఈ భాగస్వామ్య బలం, దృష్టి నుండి మనం కోరుకునే కొత్త ప్రపంచానికి, మెరుగైన భవిష్యత్తుకు నాంది పలుకుతుందని స్పష్టం చేశారు శ్రీలంక దేశ అధ్యక్షుడు.