ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
రెండు స్థానాలలో ఉప ఎన్నికకు షెడ్యూల్
హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు శాసన మండలి సభ్యుల స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ఈసీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా కడియం శ్రీహరి స్టేషన్ ఘణపూర్ నుంచి విజయం సాధించారు. దీంతో ఆ ఇద్దరూ ఎమ్మెల్యేకే పరిమితం అయ్యారు.
ఇక ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయింది. దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఈ రెండు స్థానాలలో ఎవరిని నిలబెడతారనేది ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి కోదండరాం రెడ్డి, తీన్మార్ మల్లన్న పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం వచ్చే 2027 నవంబర్ 30 వరకు ఉంది.
ఇక నోటిఫికేషన్ కు సంబధించి చూస్తే గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. 18 వరకు కొనసాగుతుంది. 19న నామినేషన్లు పరిశీలిస్తారు. 22న ఉప సంహరణకు గడువు . 29న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. వెంటనే ఫలితాలు ఓ గంట లోపు ప్రకటిస్తారు.