ఎవరి దారి వారిదే – సజ్జల
షర్మిల చేరికపై కామెంట్స్
అమరావతి – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇస్తూ ఆయన స్వంత చెల్లెలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన షర్మిల ఉన్నట్టుండి జంప్ కావడం ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది.
తాను నాలుగున్నర కోట్ల ప్రజానీకం సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని అన్నారు. అయితే తెలంగాణలో పాదయాత్ర చేపట్టి, మాజీ సీఎం కేసీఆర్ ను, ఆయన ఫ్యామిలీని ఏకి పారేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడం చర్చకు దారి తీసేలా చేసింది.
తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించిందనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నాయకుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుటుంబం అన్నాక ఒకేరీతిన ఉండరని అన్నారు. అదే సమయంలో ఎవరి దారి వారిదేనంటూ స్పష్టం చేశారు.