ఏపీలో అధికారంలోకి వస్తాం
ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ మరోసారి పవర్ లోకి రావాలని అనుకుంటోంది. ఆ మేరకు సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు ఆ పార్టీ బాస్, సీఎం జగన్ రెడ్డి.
ఇదే సమయంలో ఈసారి భంగపాటు తప్పదని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, ఏపీని అప్పుల కుప్పగా మార్చడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఆ పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు అంటున్నారు.
ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత సీఎం వైఎస్సార్ కూతురు, జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె త్వరలోనే ఏపీలో ప్రచారం చేపట్టనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఈనెల 14 నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇందులో భాగంగా ఏపీలో పార్టీ ఆధ్వర్యంలో భారత్ న్యాయ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏపీపీసీసీ చీఫ్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే 7 గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో ఇప్పటికే అమలవుతున్నాయని, తెలంగాణలో అమలు దశలో ఉన్నాయని చెప్పారు.