ఏపీలో ఎవరికి ఓటేసినా బీజేపీకే
బాబు..జగన్ ఇద్దరూ ఒక్కటే
విజయవాడ – ఏపీ పీసీసీ చీఫ్ గా కొలువు తీరిన వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెజవాడ సభలో ప్రసంగించారు. గతంలో ఏలిన చంద్రబాబు నాయుడు లక్ష కోట్లకు పైగా అప్పులు చేశాడని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆయనను దాటి రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశాడని కానీ సాధించింది ఏమీ లేదన్నారు. ఒక్క మెట్రో అయినా వచ్చిందా, రోడ్లు బాగు పడ్డాయా, ఉపాధి ఏమైనా లభించిందా, ఏనాడైనా ఒకటో తారీఖు జీతాలు అందుకున్నారా అని ప్రశ్నించారు.
ఊహించని రీతిలో వైఎస్ షర్మిల జగన్ మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని ఏకి పారేశారు. ఇద్దరి వల్ల ఏపీకి నష్టం తప్ప లాభం ఏమీ జరగలేదన్నారు. అమరావతి రాజధాని అని రాజకీయం చేశారని, మూడు రాజధానుల పేరుతో జగన్ విఫలం అయ్యాడని మండిపడ్డారు. వైసీపీ నుంచి ఇంత మంది ఎంపీలుగా గెలిచినా చివరకు ఢిల్లీలో మోదీకి గులాంలుగా మారి పోయారని ఆరోపించారు.
జగన్ కు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఎవరికి ఓటు వేసినా చివరకు బీజేపీకి ఓటు వేసినట్టేనని గుర్తు పెట్టు కోవాలన్నారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తానన్న మోదీ మతం పేరుతో రాజకీయం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఏపీకి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా అని నిలదీశారు. పాలనా పరంగా జగన్ రెడ్డి, చంద్రబాబు ఫెయిల్ అయ్యారని , లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తి మీద పెట్టారంటూ ఆరోపించారు.