ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
విశాఖపట్నం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బుధవారం విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు వైఎస్ షర్మిల.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీని పట్టించు కోలేదన్నారు. ఒకరు అమరావతి రాజధాని పేరుతో రాజకీయం చేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారంటూ ఆరోపించారు. ఇంకో వైపు మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
ఇద్దరితో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి వంత పాడుతున్నారని, ఏపీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఉత్తరాంధ్రను సర్వ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం తమ వారిని గెలిపిస్తే తీసుకు వస్తానని అన్నారని, కానీ చప్పుడు చేయడం లేదు ఎందుకని ప్రశ్నించారు.
ప్రజలు ఇప్పటికైనా అసలు వాస్తవాలు తెలుసు కోవాలని, రాబోయే ఎన్నికల్లో తమ విలువైన ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.