ANDHRA PRADESHNEWS

ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు గుడ్ బై

Share it with your family & friends

ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గేకు రిజైన్ లేఖ

అమ‌రావ‌తి – ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు గిడుగు రుద్ర‌రాజు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు పార్టీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు రాజీనామా లేఖ‌ను పంపించారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఏపీలో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి గిడుగు రుద్ర‌రాజు త‌ప్పుకోవ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఈసారి ఎలాగైనా ఏపీలో పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తోంది ఏఐసీసీ. ఈ మేర‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి త‌న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఆమె న్యూఢిల్లీలో కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు. ఆమె మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేర‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది.

ఈ స‌మ‌యంలో ఏపీలో వైఎస్ ష‌ర్మిల కీల‌కంగా మార‌నున్నారు. గిడుగు రుద్ర‌రాజుకు బ‌దులు ష‌ర్మిల‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఆమెకు గ‌నుక పార్టీ కీల‌క ప‌ద‌వి గ‌నుక అప్ప‌గిస్తే రాష్ట్ర రాజ‌కీయాలలో పెను మార్పు చోటు చేసుకునే ఛాన్స్ లేక పోలేదు.