ఒకరు పోతే 100 మంది వస్తారు
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి – ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. వైసాపీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడడంపై తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరు పోతే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. వారి స్థానంలో మరో 100 మంది తమ పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇదంతా మామూలేనని చెప్పారు.
ఇక విశాఖ పట్టణం నుంచి ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తుందా లేదా అన్నది పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మరో మాట మాట్లాడేందుకు తాను ఇష్ట పడనని పేర్కొన్నారు. పార్టీ ఏది చెబితే దానిని అనుసరిస్తూ పోవడమే తన పని అని పేర్కొన్నారు.
సమన్వయకర్తలను మార్చడం వల్ల ఆందోళనలు కొనసాగుతున్నాయని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు బొత్స సత్యనారాయణ. కేవలం కొందరిలో మాత్రమే అసంతృప్తి ఉందన్నారు. ఇది అన్ని పార్టీలలో ఉన్నదేనని స్పష్టం చేశారు.
పార్టీ కష్ట కాలంలో ఆదుకుందని, చాలా మందికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలిచి పదవులు ఇచ్చారని, ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. చంద్రబాబుకు అంత సీన్ లేదన్నారు.