ఒకే చోట టీటీడీ ఆలయాల సమాచారం
ప్రారంభించిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి – తిరుపతి, ఇతర ప్రాంతాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించే దిశగా అన్ని వివరాలతో ఆధునీకరించిన వెబ్ సైట్ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాలయాలు, అనుబంధ ఆలయాలకు సంబంధించిన స్థలపురాణం, ఆర్జితసేవలు, దర్శన వేళలు, రవాణా వివరాలు, ఇతర సౌకర్యాలను ఇందులో పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్ ను ఆధునీకరించింది.
ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగానే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సమస్త ఆలయాల సమాచారాన్ని ఇందులో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
దీని వల్ల తిరుమలతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఆలయాలు, దర్శన వేళలు, పర్యాటక ప్రాంతాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.