ఓట్ల కోసం రాముడి జపం
మోదీపై వీహెచ్ ఆగ్రహం
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు సంచలన కామెంట్స్ చేశారు. ఈనెల 22న అయోధ్య లోని రామ మందిరంలో రాముడి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టింది రామ జన్మ భూమి ట్రస్టు. అన్నీ తానై వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు. దేశ వ్యాప్తంగా శ్రీరాముడి మేనియా అల్లుకుంది.
దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరికీ రామ జన్మ భూమి ట్రస్టు ఆహ్వానాలు పంపించింది. ఇక అయోధ్యకు వెళ్లే ప్రతి భక్తుడికి అవసరమైన ఆహారం, నీళ్లు ఉచితంగా తాను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు ప్రముఖ నటుడు ప్రభాస్.
ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు వీ. హనుమంత రావు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాముడు మీద బీజేపీకి ప్రేమ లేదన్నారు. ఓట్ల కోసమే ఈ నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
అయోధ్యలో గుడి కట్టారని, కావాల్సిన వాళ్లు వెళతారని , కేవలం తాను చెప్పినప్పుడే జనం రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఇలాంటి చవకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.