DEVOTIONAL

క‌మ‌నీయం గోదా కల్యాణం

Share it with your family & friends

క‌న్నుల పండువ‌గా ఉత్స‌వం
తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో గోదా దేవి క‌ళ్యాణోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ముందుగా శ్రీకృష్ణ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మ వారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి అర్చక స్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రఘునాథ బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించి గోదా కల్యాణం విశిష్టతను వివరించారు.

జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ పాల్గొన్నారు.