కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ప్రకటించిన రిటర్నింగ్ ఆఫీసర్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్మూరి వెంకట్ , మహేష్ కుమార్ గౌడ్ లు శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైనట్లు పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా బల్మూరి వెంకట్ , గౌడ్ లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమపై నమ్మకం ఉంచి పని చేసే భాగ్యాన్ని ప్రసాదించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. తమను గుర్తించి ప్రోత్సహించిన టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డికి, ఇతర సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఊహించని రీతిలో వీరి ఎన్నిక జరిగింది. ముందు ఏఐసీసీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. వారిలో ఒకరు బల్మూరి వెంకట్ కాగా మరొకరు ఉద్యమ నాయకుడు అద్దంకి దయాకర్. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో దయాకర్ ను తప్పించింది హైకమాండ్.
ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఖంగుతిన్నారు అద్దంకి. ఆ వెంటనే దయాకర్ తన కుటుంబంతో కలిసి ముచ్చింతల్ కు వెళ్లారు. అక్కడ శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ ను కలిశారు. ఆయన ఆశీర్వాదం పొందారు.