కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ప్రకటించిన ఏఐసీసీ హై కమాండ్
హైదరాబాద్ – ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , చివరి దాకా ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నా సీటు కోల్పోయిన అద్దంకి దయాకర్ కు ఛాన్స్ ఇచ్చింది. ఈ ఇద్దరూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు.
భారత్ జోడో యాత్రలో ఈ ఇద్దరూ కీలకంగా మారారు. విద్యార్థుల సమస్యలను గత ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడంలో బల్మూరి వెంకట్ ముఖ్య భూమిక పోషించారు. ఇదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ ముందు నుంచీ తన వాయిస్ తో పాటు ప్రజల గొంతుకగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
బల్మూరి వెంకట్ , అద్దంకి దయాకర్ కు ముఖ్య నేతల నుంచి ఫోన్లు వచ్చాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దం కావాలని సూచించింది ఏఐసీసీ. ఈనెల 18న తుది గడువు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం.