కాంగ్రెస్ కోతలు ప్రజలకు కష్టాలు
నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం నల్లగొండ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి కరెంట్ బిల్లులు కట్టొద్దన్నారని, అందుకే తాను దీని గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు.
ఈ జిల్లా ప్రజలు ఎవరూ బిల్లులు కట్టకుండా మంత్రి ఇంటికే పంపించాలని పిలుపునిచ్చారు. విచిత్రం ఏమిటంటే తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందన్నారు. శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టును ఎండ బెడుతోందన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ నేతల కోతలు ప్రజలకు శాపంగా మారాయని ఆరోపించారు. అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. జనవరి 3న ఆదిలాబాద్ తో ప్రారంభమైన ఈ సన్నాహక సమావేశాలు నేడు నల్లగొండతో ముగిశాయని చెప్పారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని అన్నారు. ప్రభుత్వ అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియ చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే నాయకులని అన్నారు. మీ వల్లనే ఇవాళ పార్టీ ఇంతలా ఎదిగిందన్నారు. 16 సమావేశాలు నిర్వహించామని, మీరంతా అండగా ఉన్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు కేటీఆర్. ఓటమిపై ఆలోచించ లేదన్నారు. అభివృద్ది చేసినా ఆదరించ లేదన్నారు.